కేసీఆర్ కలల ప్రాజెక్ట్ కాళేశ్వరం

ముఖ్యమంత్రి కేసీఆర్ 

కలల ప్రాజెక్ట్ కాళేశ్వరం


తలాపున పారే గోదారిని మన బీళ్లకు మళ్లించేందుకు చేపట్టిన మహాయజ్ఞం. కాళేశ్వరంఎత్తిపోతల ద్వారా 13 జిల్లాల్లోని 18.26ఎకరాలను సస్యశ్యామలం చేసే భగీరథ ప్రయత్నం. ఇందులో భాగంగానే ఏడాదిన్నర క్రితం కీలకమైన మేడిగడ్డ బ్యారేజీ, కాళేశ్వరం పంప్‌హౌస్ నిర్మాణాలకు ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా అంకురార్పణ జరిగింది. అప్పటి నుంచి ఇప్పటిదాకా యుద్ధప్రాతిపదికన పనులు జరుగుతుండగా, భూమిపూజ తర్వాత తొలిసారిగా పనుల పరిశీలనకు సీఎం వస్తున్నారు. గురు, శుక్రవారాల్లో మేడిగడ్డ నుంచి మిడ్‌మానేరుదాకా పర్యటించనున్న ఆయన, బుధవారం సాయంత్రానికే తీగలగుట్టపల్లికి చేరుకున్నారు. 
తెలంగాణ సర్వతోముఖాభివృద్ధిలో గోదావరి పాత్ర ఎనలేనిది. నిజామాబాద్ జిల్లా రెంజల్ మండలం కందకుర్తి వద్ద రాష్ట్రంలో ప్రవేశించే ఈ నది, నాలుగు జిల్లాల మీదుగా సుమారు 600 కిలోమీటర్లు ప్రయాణించాక ఆంధ్రప్రదేశ్‌లో అడుగిడుతుంది. ఉమ్మడి రాష్ట్రంలో వివక్ష వల్ల ఒక్క శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ తప్ప చెప్పుకోదగ్గ జలాశయాలు లేకపోవడంతో ఏటా వేలాది టీఎంసీల నీరు సముద్రంపాలవుతూ వచ్చింది. ఈ నీటిని ఒడిసి పట్టే లక్ష్యంతోనే ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రాజెక్టుల రీ డిజైనింగ్‌ను తెరపైకి తెచ్చారు. ఇందులో భాగంగానే కాళేశ్వరం ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారు. ఈ ఎత్తిపోతలతో సుమారు 180 నుంచి 200టీఎంసీల నీటిని ఏడాది పొడవునా వినియోంగిచనున్నారు. ఎల్లంపల్లి నుంచి మధ్యమానేరుకు, అక్కడి నుంచి వివిధ ప్రాజెక్టులకు ఎత్తిపోయడమేకాకుండా, కాళేశ్వరం నుంచి వచ్చే నీటితో ఎస్సారెస్పీని నింపాలన్న ఉదేశ్యంతో ప్రభుత్వం తాజాగా పునర్జీవ పథకానికి శ్రీకారం చుట్టింది. ఇదే సమయంలో ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి మేడిగడ్డ వరకు అంటే సుమారు 125 నుంచి 130 కిలోమీటర్ల దూరం వరకు 30ఫీట్ల లోతు నీళ్లు ఎప్పుడూ ఉండే అవకాశమున్నది. ఇందులో భారీగా చేపలు పెంచడానికి ఆస్కారముంటుంది. 
ముఖ్యమంత్రి కేసీఆర్ తన మాన పుత్రిక అయిన కాళేశ్వరం ప్రాజెక్టు పనులను పరుగులు పెట్టిస్తున్నారు. చెప్పింది చెప్పినట్లు కార్యరూపంలో పెడుతున్నారు. ప్రాజెక్టు రీడిజైనింగ్‌లో భాగంగా గోదావరిపై చేపడుతున్న కాళేశ్వరం ఎత్తిపోతల పథకం పనులు శరవేగంగా చేయిస్తున్నారు. ఈ ప్రాజెక్టు నిర్మాణంలో మహారాష్ట్రను ఒప్పించి, అసాధ్యం అనుకున్న పనిని సుసాధ్యం చేసి చూపించారు. నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు నిరంతర నిఘా, పర్యవేక్షణతో ఏకకాలంలో అన్ని పనులు ప్రారంభం కావడమేకాదు, పలు అవాంతరాలను అధిగమించి ముందుకు సాగుతున్నాయి. కేంద్రం నుంచి మెజార్టీ అనుమతులు వచ్చాయి. ఇదే సమయంలో ఇప్పటికే మధ్యమానేరు ప్రాజెక్టును పూర్తిచేసిన ప్రభుత్వం, శ్రీరాంసాగర్ పునర్జీవ పథకం పనులను ముందుకుతీసుకెళ్తున్నది. ఈ పనుల కోసం 1067 కోట్లకు ఇప్పటికే పరిపాలన ఆమోదం తెలిపింది. పునర్జీవ పథకం పూర్తయితే ఏకంగా 12.40 లక్షల ఎకరాల ఆయకట్టు సస్యశ్యామలం కానున్నది.
కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా మూడు బ్యారేజీలు, మూడు పంపుహౌస్‌లు నిర్మిస్తున్నారు. ఇందులో మొదటిది మేడిగడ్డబ్యారేజీ. జయశంకర్ భూపాల్‌పల్లి (పాత కరీంనగర్ జిల్లా) జిల్లా మహదేవపూర్ మండలం వద్ద 1850కోట్లతో ఈ బ్యారేజీ నిర్మాణం చేస్తున్నారు. కాళేశ్వరం నుంచి 20కిలోమీటర్ల దిగువన 101 మీటర్ల ఎఫ్‌ఆర్‌ఎల్‌తో చేపడుతున్నారు. దీని పూర్తి నిల్వనీటి సామర్థ్యం 19.73 టీఎంసీలు, 85గేట్లు బిగించనున్నారు. ఈ పనులను ఎల్‌ఎన్‌టీ కంపెనీ చేస్తున్నది. ఈ బ్యారేజీలో భాగంగా మహదేవపూర్ మండలం కన్నెపల్లి వద్ద పెద్ద పంపుహౌస్ కడుతున్నారు. 2826 కోట్లతో చేపడుతున్న ఈ పంపుహౌస్ నుంచి రోజుకు మూడు టీఎంసీల నీటిని ఎత్తిపోసే అవకాశమున్నది. మెగా కన్‌స్ట్రక్షన్, ఎస్‌సీసీ కంపెనీ వారు నిర్మాణం చేస్తున్నారు. పనులు యుద్ధప్రాతిపదికన చేయిస్తున్నారు.

- అన్నారం బ్యారేజీ రెండోది. దీనిని 1453 కోట్ల వ్యయంతో మహదేవ్‌పూర్ మండలం అన్నారం వద్ద కడుతున్నారు. ఇక్కడ మానేరు వచ్చి గోదావరిలో కలుస్తుంది. దీని సామర్థ్యం 10.87టీఎంసీలు కాగా, ఈ బ్యారేజీపై 60 గేట్లు బిగించనున్నారు. ఇదే బ్యారేజీలో భాగంగా పెద్దపల్లి జిల్లా మంథని మండలం గుంజపడుగు పంచాయతీ పరిధిలోని కాసిపేట వద్ద పంపుహౌస్ నిర్మాణంచేస్తున్నారు. 1670కోట్లతో నిర్మిస్తున్న ఈ పంపుహౌస్ ద్వారా రోజుకు 3టీఎంసీల నీటిని ఎత్తిపోసే విధంగా డిజైన్‌చేసి పనులు చేస్తున్నారు. ఈ పనులను మెగా కన్‌స్ట్రక్షన్స్ నిర్వహిస్తున్నది.

- సుందిళ్ల బ్యారేజీ మూడోది. 1250 కోట్ల వ్యయంతో మంథని మండలం సిరిపురం గ్రామ శివారులో నిర్మిస్తున్నారు. 7.5 టీఎంసీల సామర్థ్యం గల ఈ బ్యారేజీకి, 68 గేట్లు బిగించనున్నారు. నవయుగ కన్‌స్ట్రక్షన్ కంపెనీ ఈ పనులను చేస్తుండగా, బ్యారేజీ ఫౌండేషన్‌కు సంబంధించిన పనులు వేగంగా చేస్తున్నారు. సుందిళ్ల పంపుహౌస్ నిర్మాణంలో భాగంగా పెద్దపల్లి జిల్లా అంతర్గాం మండలం గోలివాడ వద్ద పంపుహౌస్ కడుతున్నారు. రోజుకు మూడు టీఎంసీల నీటిని ఎత్తిపోసే విధంగా డిజైన్ చేశారు. 738 కోట్లతో చేపడుతున్న ఈ పనులను మెగా కన్‌స్ట్రక్షన్స్ నిర్వహిస్తున్నది. అన్నిచోట్లా పనులను యుద్ధ ప్రాతిపదికన చేస్తున్నారు. రెండేళ్లలో బ్యారేజీలను, పంపుహౌస్‌లను పూర్తిచేయడమే లక్ష్యంగా మందుకు సాగుతున్నారు. ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి సీసీ కెమెరాల ద్వారా పర్యవేక్షిస్తున్నారు.

- కరీంనగర్ చేరిన సీఎం..

కాళేశ్వరం ఎత్తిపోతలకు ఏడాదిన్నర క్రితం భూమిపూజ చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్, తాజాగా క్షేత్రస్థాయి పర్యటనకు వస్తున్నారు. గురు, శుక్రవారాల్లో పనులను పరిశీలించనున్నారు. ఇందులో భాగంగానే బుధవారం సాయంత్రం 5.20నిమిషాలకు కరీంనగర్ శివారు తీగలగుట్టపల్లిలోని ఉత్తర తెలంగాణ భవన్‌కు చేరుకున్నారు. ఆయన వెంట భారీ నీటిపారుదల శాఖ మంత్రి టీ హరీశ్‌రావు, ఎంపీలు బీ వినోద్‌కుమార్, బాల్క సుమన్, సీఎంవో కార్యాలయ కార్యదర్శి స్మితా సబర్వాల్, టీఆర్‌ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, సీఎం వ్యక్తిగత కార్యదర్శి సంతోష్‌రావు తదితరులు వచ్చారు. మంత్రి ఈటల రాజేందర్, ప్రభుత్వ చీఫ్‌విప్ కొప్పుల ఈశ్వర్, రాజ్యసభ సభ్యులు కెప్టెన్ లక్ష్మీకాంత రావు, జడ్పీ అధ్యక్షురాలు తుల ఉమ, ఎమ్మెల్యేలు గంగుల కమలాకర్, ఒడితెల సతీశ్‌కుమార్, దాసరి మనోహర్ రెడ్డి, రసమయి బాలకిషన్, ఎమ్మెల్సీలు నారదాసు లక్ష్మణ్ రావు, భానుప్రసాద్ రావు, ఐడీసీ చైర్మన్ ఈద శంకర్ రెడ్డి, నగర మేయర్ సర్దార్ రవీందర్‌సింగ్‌తోపాటుగా పలువురు నాయకులు ముఖ్యమంత్రికి ఘన స్వాగతం పలికారు. 

రెండు రోజులపాటు పర్యటన 

గురువారం ఉదయం 9 గంటలకు తీగలగుట్టపల్లి నుంచి హెలికాప్టర్‌లో బయలుదేరుతారు. 9.50 గంటలకు తుపాకులగూడెం వద్దకు చేరుకొని 10.20 వరకు బ్యారేజీ పనులను పరిశీలిస్తారు. 10.40 నుంచి 11గంగల దాకా మేడిగడ్డ బ్యారేజీని, 11.15 నుంచి 11.45 గంటల దాకా కన్నెపల్లి పంప్‌హౌస్‌ను, 12 నుంచి 12.20 గంటల వరకు అన్నారం బ్యారేజీని, 12.40 నుంచి 1.30 వరకు శ్రీపురం పంపుహౌస్‌ను పరిశీలిస్తారు. ఆ తర్వాత మధ్యాహ్నం 2 నుంచి 2.20 గంటల వరకు సుందిళ్ల బ్యారేజీని, 2.45 నుంచి 3.30 గంటల వరకు గోలివాడ పంపుహౌస్‌ను పరిశీలిస్తారు. 4.15 గంటలకు రామగుండంలోని ఎన్టీపీసీ అతిథి గృహానికి చేరుకొని, రాత్రి అక్కడే బస చేస్తారు.
 శుక్రవారం ఉదయం 9 గంటలకు రామగండం నుంచి బయలుదేరుతారు. 9.20 గంటలకు మేడారం ప్యాకేజీ -6 పంపుహౌస్ వద్దకు చేరుకుని, 12గంటల వరకు పంపు హౌజ్‌ను పరిశీలిస్తారు. తిరిగి 12.20గంటలకు రామడుగు మండలం వద్ద కొనసాగుతున్న ప్యాకేజీ-8 పంపుహౌస్ పనులు, సర్జ్‌పూల్‌ను పరిశీలిస్తారు. ఇక్కడే భోజనం చేసి, అనంతరం అధికారులతో సమీక్షిస్తారు. 2.30 గంటలకు రామడుగు నుంచి బయలుదేరి 2.45కు మల్యాల మండలం రాంపూర్ వద్ద జరుగుతున్న పంపుహౌస్ పనులను పరిశీలిస్తారు. అనంతరం 3.40 గంటలకు మధ్య మానేరును పరిశీలిస్తారు. అనంతరం 4.30 గంటలకు హైదరాబాద్ బయలుదేరి వెళ్తారు.

Comments