లంకతో మూడో టెస్టు డ్రా

లంకతో మూడో టెస్టు డ్రా 

1-0తో సిరీస్ నెగ్గిన విరాట్‌సేన
వరుసగా 9 సిరీస్‌లు నెగ్గిన భారత్
ఆసీస్, ఇంగ్లండ్‌ల రికార్డు సమం 

భారత టెస్టు చరిత్రలో టీమ్‌ఇండియా సరికొత్త ఆధ్యాయాన్ని లిఖించింది. ఎంతో మంది దిగ్గజ కెప్టెన్లు, ఆటగాళ్లకు సాధ్యంకాని ఓ అరుదైన రికార్డును విరాట్‌సేన ఒడిసిపట్టుకుంది. ఒకటి, రెండు సిరీస్‌లు గెలువడమే కష్టమైపోతున్న ఈ రోజుల్లో ఏకంగా వరుసగా తొమ్మిది సిరీస్‌లను గెలిచి నూతన ఒరవడికి శ్రీకారం చుట్టింది. తద్వారా ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌ల సరసన భారత్ చోటు సంపాదించింది. 2015లో శ్రీలంకతో మొదలైన జైత్రయాత్రకు... మళ్లీ లంక వరకు కొనసాగించి నవ సిరీస్ రికార్డుల ఘనతను సగర్వంగా అందుకుంది. ఢిల్లీ టెస్టును డ్రా చేసుకోవడం ద్వారా లంకతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌ నూ 1-0తో కైవసం చేసుకుని ఐదు రోజుల ఫార్మాట్‌లో రారాజులం మేమే అని చాటి చెప్పింది..! 
indian-team
న్యూఢిల్లీ: తొలి నాలుగు రోజులు బౌలర్లకు ఊహించని రీతిలో సహకారం అందించిన ఫిరోజ్ షా కోట్ల పిచ్.. ఆఖరి రోజు మాత్రం భారత్‌కు చేయిచ్చింది. విజయానికి ఏడు వికెట్లు మాత్రమే కావాల్సిన దశలో టీమ్‌ఇండియా బౌలర్లు ఎంత శ్రమించినా.. లంకేయులను పడగొట్టలేకపోయారు. దీంతో బుధవారం భారత్, శ్రీలంక మధ్య ముగిసిన మూడో టెస్టు డ్రా అయ్యింది. ఫలితంగా మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను విరాట్‌సేన 1-0తో కైవసం చేసుకుంది. 410 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో చండిమల్‌సేన రెండో ఇన్నింగ్స్‌లో 103 ఓవర్లలో 5 వికెట్లకు 299 పరుగులు చేసింది. ధనంజయ డిసిల్వా (219 బంతుల్లో 119; 15 ఫోర్లు, 1 సిక్స్) సెంచరీతో ఒంటరిపోరాటం చేయగా, రోషన్ సిల్వ (74 నాటౌట్), డిక్వెల్లా (44 నాటౌట్).. భారత్ విజయాన్ని అడ్డుకున్నారు. మూడు టెస్టుల్లో కలిపి 610 పరుగులు చేసిన భారత కెప్టెన్ విరాట్ కోహ్లీకి... మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్; మ్యాన్ ఆఫ్ ద సిరీస్ అవార్డులు లభించాయి. ఈనెల 10 నుంచి ఇరుజట్ల మధ్య వన్డే సిరీస్ ప్రారంభంకానుంది. 

Comments