- Get link
- X
- Other Apps
మినీట్యాంక్‌బండ్ అన్యాక్రాంతం
ఒకవైపు అభివృద్ధి, మరోపక్క ఆక్రమణలు
ఎంపీటీసీ ఫిర్యాదుతో వెలుగులోకి..
రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంగా ఏర్పడటంతో భూముల ధరలకు రెక్కలొచ్చాయి. కబ్జాదారులు ప్రభుత్వ భూమి ఎక్కడ కనిపిస్తే అక్కడ పాగా వేస్తున్నారు. పట్టణాన్ని ఆనుకుని ఉన్న కొత్తచెరువు వారి కోరల్లో చిక్కుకుంది. రూ.6కోట్లపైచీలుకు నిధులతో మినీట్యాంక్‌బండ్‌గా తీర్చిదిద్దుతున్న ఈ చెరువు అక్రమార్కుల పాలవుతోంది. ఏకంగా చెరువు మత్తడి కాలువనే మాయం చేసిన కబ్జాకోరులు దాన్ని అనుకునే బోరుబావులు తవ్వించి మరీ చెరువు భూముల్లో నిర్మాణాలు చేపట్టారు. చంద్రంపేట ఎంపీటీసీ సూరదేవరాజు ఫిర్యాదుతో ఈ తతంగమంతా వెలుగుచూసింది.
సిరిసిల్ల పట్ణణశివారులో కరీంనగర్ ప్రధాన రహదారిని ఆనుకుని ఉన్న కొత్తచెరువు పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేసేందుకు శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా రాష్ట్ర ఐటీ, మున్సిపల్‌శాఖ మంత్రి కేటీఆర్ రూ.6కోట్లపైచీలుకు నిధులతో మినీట్యాంక్‌బండ్‌గా తీర్చిదిద్దుతున్నారు. ఇప్పటికే ఆ పనులు వేగవంతంగా సాగుతున్నాయి. ఓ వైపు చెరువు అభివృద్ధి పనులు సాగుతుండగా మరోవైపు శిఖంభూముల్లో అక్రమార్కులు కబ్జాకు తెరలేపారు. 'చాపకింద నీరు'లా చెరువు భూముల్లోనూ పాగా వేస్తున్నారు. 70 ఎకరాలపైచీలుకు విస్తీర్ణం ఉన్న ఈ చెరువు మత్తడి, తూముకాలువ ద్వారా ఆయకట్టుకు నీరందించే కాలువ ప్రస్తుతం శాంతినగర్ ప్రాంతంలో పూర్తిగా కనుమరుగైంది. ఇప్పుడు ఏకంగా ఉన్నకాస్త కాలువను సైతం కబ్జా చేసిన అక్రమార్కులు మత్తడిని ఆనుకుని బోరుబావులు తవ్వించారు. ఇటీవలే పట్టణానికి చెందిన ఓ వస్త్ర పారిశ్రామిక వేత్త ప్రాసెసింగ్ యూనిట్ నిర్మాణం కోసం మత్తడి కాలువనే ఆక్రమించాడు. దీనికి తోడు గ్రామపంచాయతీ అనుమతులు లేకుండానే నిర్మాణం చేసి ప్రాసెసింగ్ యూనిట్‌ను ఏర్పాటు చేశారు. ఈ అక్రమ నిర్మాణంపై చంద్రంపేట ఎంపీటీసీ సూరదేవరాజు అధికారులకు ఫిర్యాదు చేయడంతో ఆ చెరువులో సాగుతున్న 'కబ్జాలీలలు' వెలుగులోకి వచ్చాయి. చెరువు పట్టణానికి ఆనుకుని ఉండటం, రోజురోజుకూ నివాసప్రాంతాలూ విస్తరించడంతోడు ఇటీవల జిల్లా కేంద్రమూ అయింది. దీంతో రాజన్నసిరిసిల్ల జిల్లా కేంద్ర భూములకు రెక్కలొచ్చాయి. రూ.కోట్లు పలుకుతుండటంతో అక్రమార్కులు ప్రభుత్వ భూములు, చెరువు శిఖం భూములను కబ్జా చేస్తున్నారు. అధికార లెక్కల్లో ఉన్నంతగా ప్రస్తుతం కొత్త చెరువు విస్తీర్ణం ఉండకపోవచ్చనేది పట్టణవాసులు చెబుతున్నారు. ఇప్పటికైనా నీటిపారుదలశాఖ, రెవెన్యూ అధికారులు సమన్వయంతో చెరువులకు హద్దులు గుర్తించి, అన్యాక్రాంతం కాకుండా చూడాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది.
ప్రభుత్వ భూములను కాపాడాలి : ఎంపీటీసీ సూరదేవరాజు
జిల్లా కేంద్రంలో భూములకు ధరలు పెరగడంతో అక్రమార్కులు ప్రభుత్వభూములను కబ్జా చేస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా కాలుష్యం వెదజల్లే పరిశ్రమలు ఏర్పాటు చేయడంతోపాటూ ఏకంగా చెరువు మత్తడి కాలువను ఆక్రమించుకుని నిర్మాణం చేపట్టడం దారుణం. ఈ విషయమై ఇప్పటికే అధికారులకు ఫిర్యాదు చేశాను. రెవెన్యూ అధికారులు, నీటిపారుదలశాఖ అధికారులు మత్తడి కాలువను పరిశీలించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలి.
ప్రభుత్వ భూములను కాపాడాలి : ఎంపీటీసీ సూరదేవరాజు
జిల్లా కేంద్రంలో భూములకు ధరలు పెరగడంతో అక్రమార్కులు ప్రభుత్వభూములను కబ్జా చేస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా కాలుష్యం వెదజల్లే పరిశ్రమలు ఏర్పాటు చేయడంతోపాటూ ఏకంగా చెరువు మత్తడి కాలువను ఆక్రమించుకుని నిర్మాణం చేపట్టడం దారుణం. ఈ విషయమై ఇప్పటికే అధికారులకు ఫిర్యాదు చేశాను. రెవెన్యూ అధికారులు, నీటిపారుదలశాఖ అధికారులు మత్తడి కాలువను పరిశీలించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలి.
- Get link
- X
- Other Apps
Comments
Post a Comment