అనారోగ్యంతో చనిపోయిన తన భార్య మృతదేహాన్ని దిక్కుతోచని పరిస్థితుల్లో కూతురును వెంటబెట్టుకొని, భార్య మృతదేహాన్ని భుజాన వేసుకుని పది కిలో మీటర్లు నడుచుకుంటూ వెళ్లి యావత్ ప్రపంచ దృష్టిని తనవైపుకు తిప్పుకున్న ఒడిశా గిరిజనుడు ధనా మాఝీ అందరికీ గుర్తుండే ఉంటుంది. దీన స్థితిలో ఉన్న మాఝీ పరిస్థితి ఇప్పుడు అమాంతం మారిపోయింది. తన భార్య మృతదేహాన్ని ఎత్తుకుని ఎక్కడి నుంచైతే(భవానిపట, కలహండి జిల్లా) తన సొంత ఊరు(మేల్గార్)కు నడుచుకుంటూ వెళ్లాడో గురువారంనాడు అదే రహదారి గుండా కొత్త బైక్ కొనుక్కొని రయ్ మంటూ దూసుకెళ్లాడు. కొత్త ఇల్లు, కొత్త భార్య, కొత్త మోటార్ బైక్‌తో హల్‌చల్ చేస్తున్నాడు. ఇక ఆయన ముగ్గురు కూతుళ్లను ఓ ప్రైవేట్ స్కూలు దత్తత తీసుకుని ఉచితంగా విద్యనందిస్తోంది. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఆయనకు కేంద్ర ప్రభుత్వం ఓ ఇంటిని మంజూరు చేసింది. ఇప్పుడు ఆ ఇల్లు నిర్మాణం ముగింపు దశలో ఉంది. ఇక బహ్రెయిన్ రాజు బిన్ సల్మాన్ అల్ ఖలీఫా పంపించిన రూ.9లక్షలను బ్యాంకులో ఫిక్స్‌డ్ డిపాజిట్ చేసుకుని ఆర్థికంగా కూడా హాయిగా ఉన్నాడు. అన్నట్టూ ఇక కొత్త భార్య అలామతి దేవ్ ఇప్పుడు గర్భవతి. త్వరలో మాఝీ మరోసారి తండ్రి కాబోతున్నాడన్నమాట..!
Comments
Post a Comment